ఛత్తీస్గఢ్ లోని సక్తి జిల్లా సింగీతరాయ్ ప్రాంతంలో ఉన్న వేదాంత లిమిటెడ్ కు చెందిన పవర్ ప్లాంట్‌లో మంగళవారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో బాయిలర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో ప్లాంట్ పరిసరాల్లో తీవ్ర కలకలం రేగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో సుమారు 30 నుంచి 40 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, అధికారికంగా మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. బాయిలర్ పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో దాని శబ్దం దూర ప్రాంతాల వరకూ వినిపించింది. ఒక్కసారిగా జరిగిన ఈ పేలుడుతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. ప్లాంట్‌లో ఆ సమయంలో విధుల్లో ఉన్న కార్మికులు తీవ్రంగా గాయపడటంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఘటన సమాచారం అందుకున్న వెంటనే సక్తి జిల్లా అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకా కొంతమంది చిక్కుకుని ఉండే అవకాశం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రాథమికంగా ఇది సాంకేతిక లోపం లేదా భద్రతా నిబంధనలలో నిర్లక్ష్యం కారణంగా జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
0 Comments