ఇరాన్ చమురుకు ఆయువుపట్టు లాంటి ఖర్గ్ ఐలాండ్‌పై తాము సరదాగా మరిన్ని దాడులు చేయవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తమ దళాలు జరిపిన దాడుల్లో ఐలాండ్ చాలా భాగం ధ్వంసమైందని చెప్పారు. కానీ సరదాగా తాము మరికొన్ని సార్లు దాన్ని లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ బలగాల యుద్ధం మూడో వారానికి చేరుకుంది. ఖర్గ్‌లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇప్పటికే అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో వాటిని పూర్తిగా ధ్వంసం చేసినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అక్కడి చమురు క్షేత్రాలను మాత్రం టచ్ చేయలేదని తెలిపారు. ఇక యుద్ధం ముగింపునకు సంబంధించి ఒప్పందం కోసం ఇరాన్ ఇప్పుడు సిద్ధంగా ఉందన్నారు. అయితే అందుకు ప్రతిపాదించిన షరతులు సరిపోవని ట్రంప్ తెలిపారు. దాంతో యుద్ధం ముగించేందుకు ఇప్పుడు తాను సిద్ధంగాలేనని తేల్చిచెప్పారు. కాల్పుల విరమణకు సంబంధించిన నిబంధనలు బలంగా ఉండాలన్నారు. అయితే ఆ నిబంధనలు ఏమిటో చెప్పేందుకు ట్రంప్ నిరాకరించారు.
0 Comments