జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరితో కలిసి ఫరూక్ అబ్దుల్లా ఒక వివాహ కార్యక్రమం నుంచి బయటకు వస్తుండగా ఆగంతకుడు తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. నిందితుడు జమ్మూలోని పురాని మండి నివాసి అయిన 63 ఏళ్ల కమల్ సింగ్ జామ్వాల్‌గా గుర్తించారు. గత 20 సంవత్సరాలుగా అబ్దుల్లాను లక్ష్యంగా చేసుకున్నానని, ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని పోలీసులకు చెప్పాడు. ''అది నా వ్యక్తిగత ఎజెండా. ఆ ఆయుధం నా సొంతం. నాకు జారీ చేయబడింది.'' అని తెలిపాడు. సంఘటన జరిగిన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారం రాజ్యసభను కుదిపేసింది. ఎన్టీఏ పాలనలో భద్రత లేదంటూ కాంగ్రెస్ అగ్ర నేత మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపించారు. హత్యాయత్నం నుంచి బయటపడిన తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా (88) తొలిసారి మీడియాతో మాట్లాడుతూ అల్లా దయ వల్ల తాను ప్రమాదం నుంచి బయటపడినట్లుగా చెప్పారు. జమ్మూలో జరిగిన ఒక వివాహంలో తనపై జరిగిన కాల్పులను తొలుత బాణాసంచా అనుకుని పొరపడినట్లు పేర్కొన్నారు. శబ్దం రాగానే సెక్యూరిటీ సిబ్బంది కారు ఎక్కించేశారని, అనంతరం తుపాకీ పట్టుకున్న వ్యక్తి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడని చెప్పారన్నారు. ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదన్నారు. దేవుడే తన ప్రాణాలను రక్షించాడని చెప్పారు. దాడి వెనుక ఉన్న ఉద్దేశ్యం గురించి లేదా అది భద్రతా లోపమా కాదా అనే దాని గురించి తాను ఊహించలేనన్నారు. తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది, ఇతర అధికారులు స్పందించారని, తనను రక్షించడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టారని చెప్పారు. కాల్పుల తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేసి తన క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని, విచారణ జరగాలని అమిత్ షా అన్నారని తెలిపారు. అయినా ఏ మతమూ ద్వేషాన్ని బోధించదని, ప్రేమను మాత్రమే నేర్పుతుందని అన్నారు.
0 Comments