Ad Code

శత్రు దేశాలు బేషరతుగా లొంగిపోతేనే యుద్ధం ఆగుతుంది : ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ


శాంతి చర్చలకు తావులేదని, శత్రు దేశాలు బేషరతుగా లొంగిపోతేనే యుద్ధం ఆగుతుందని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ మొదటి విదేశాంగ విధాన ఉత్తర్వులో స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం నుంచి అందుతున్న అన్ని కాల్పుల విరమణ ప్రతిపాదనలను మొజ్తబా ఖమేనీ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఒక సీనియర్ ఇరాన్ అధికారి సమాచారం ప్రకారం అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్ ముందు మోకరిల్లి, లొంగిపోవడమే కాకుండా వాళ్లు చేసిన నష్టానికి భారీ పరిహారం చెల్లించాలని మొజ్తబా డిమాండ్ చేశారు. ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా ఇరాన్ సైన్యం ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారని చెప్పారు. ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేయడం ద్వారా శత్రు దేశాలను ఆర్థికంగా దెబ్బతీయవచ్చని మొజ్తబా వ్యూహ రచన చేశారు. వారం క్రితమే తన తండ్రి అలీ ఖమేనీ వారసుడిగా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా, ఇప్పటివరకు బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఇది అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇటీవలి దాడుల్లో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయని ఇరాన్ వర్గాలు అంటుంటే, ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని అమెరికా నిఘా వర్గాలు వాదిస్తున్నాయి. తాజాగా జరిగిన సమావేశానికి కూడా ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారా లేదా ఆన్‌లైన్‌లో పాల్గొన్నారా అనే దానిపై స్పష్టత లేదు.

Post a Comment

0 Comments

Close Menu