హిస్సార్ - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. రైలు ఇంజిన్ చక్రం ఒక్కసారిగా విరిగిపోవడంతో లోకో పైలట్ అప్రమత్తమై రైలును నిలిపివేశాడు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ వైపు వెళ్తున్న హిస్సార్ ఎక్స్‌ప్రెస్, హన్మకొండ జిల్లా ఉప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలోని మడిపల్లి గేట్ వద్దకు రాగానే సాంకేతిక లోపం తలెత్తింది. ఇంజిన్ చక్రం విరిగిపోవడాన్ని గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే రైలును అక్కడే నిలిపివేశారు. ఫలితంగా సుమారు 4 గంటల పాటు రైలు ట్రాక్‌పైనే ఉండిపోయింది. నిర్మానుష్య ప్రదేశంలో ట్రైన్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న రైల్వే సాంకేతిక నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక మరమ్మతులు చేపట్టారు. అనంతరం కాజీపేట నుంచి మరో ఇంజిన్‌ను రప్పించి, దాని సహాయంతో రైలును నెమ్మదిగా ఉప్పల్ రైల్వే స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేలా ఏర్పాట్లు చేశారు. ఇక రైలు ఇంజిన్ చక్రం విరిగిపోవడంపై రైల్వే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. పట్టాల నాణ్యత లోపం, ఇంజిన్ మెయింటెనెన్స్ లోపం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు.
0 Comments