తెలంగాణలోని నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కృపా గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు చెప్పులు క్యూలో పెట్టి అర్ధరాత్రి నుంచి పడిగాపులు పడుతున్నారు. రాత్రి 2 గంటల నుంచే బారులు తీరడం గ్యాస్ కొరత తీవ్రతను తెలియజేస్తోంది. గ్యాస్ సిలిండర్ కోసం ఇలా రాత్రివేళ నుంచే క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొనడం స్థానికుల్లో ఆందోళనకు కారణమైంది. గత ఐదు రోజులుగా గ్యాస్ బుకింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నా బుకింగ్ కావడం లేదని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఆన్‌లైన్, ఫోన్ ద్వారా బుకింగ్ సక్రమంగా పనిచేయకపోవడంతో వారు నేరుగా ఏజెన్సీ వద్దకు చేరుకుని ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో ఏజెన్సీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున క్యూలు కనిపిస్తున్నాయి. సకాలంలో గ్యాస్ సిలిండర్ రాక గృహిణులు వంట చేయాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ వంట కార్యక్రమాలు సైతం అంతరాయం కలుగుతున్నాయని వారు చెబుతున్నారు. కొందరు అత్యవసర పరిస్థితుల్లో అధిక ధరలకు బ్లాక్‌లో సిలిండర్లు కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బ్లాక్ లో గ్యాస్ సిలిండర్ ధర మూడు వేల రూపాయలకు అమ్ముతున్నట్లు వారు చెబుతున్నారు. ఇదిలాఉంటే, గ్యాస్ సరఫరా వ్యవస్థలో లోపాలు, ఏజెన్సీల ప్రణాళికా లోపాలతో ఈ కొరత ఏర్పడుతోందని తెలుస్తోంది. అధికారులు సమస్యపై ఇప్పటికే ఏజెన్సీలకు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, పరిస్థితిలో మార్పు కనిపించకపోవడం విమర్శలకు కారణంగా మారుతుంది. వినియోగదారులకు సకాలంలో సరఫరా జరిగేలా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.మరోవైపు, గ్యాస్ ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశంపై కూడా వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పెరుగుతున్న ఖర్చుల మధ్య గ్యాస్ ధరలు పెరగడం సాధారణ ప్రజలపై మరింత భారం మోపుతుందని వారు భావిస్తున్నారు.
0 Comments