ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న దాదాపు 300 వెబ్‌సైట్లు, యాప్స్‌ను ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఇందులో కేవలం స్పోర్ట్స్ బెట్టింగ్ మాత్రమే కాకుండా, బెట్టింగ్ ఎక్స్ఛేంజీలు, గ్యాంబ్లింగ్ నెట్‌వర్క్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా డబ్బులతో ఆడే రియల్ మనీ కార్డ్ గేమ్స్, క్యాసినో యాప్స్‌పై కూడా నిషేధం విధించారు. చాలామంది యువకులు ఆన్‌లైన్ జూదానికి బానిసలై తమ విలువైన సమయాన్ని, కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటున్నారు. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరగడమే కాకుండా ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇలాంటి పెడదోవ పట్టించే యాప్స్ వల్ల సమాజానికి ముప్పు ఉందని గ్రహించిన కేంద్రం, ఈ దందాను అరికట్టడానికి గట్టి చర్యలు చేపట్టింది. బెట్టింగ్ మాఫియాను పూర్తిగా అదుపులోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్‌లో ‘ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్ 2025’ను తీసుకొచ్చింది. ఇక ఈ చట్టం ప్రకారం నగదుతో ముడిపడి ఉన్న అక్రమ ఆన్‌లైన్ గేమింగ్‌ను పూర్తిగా నిషేధించారు. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వం తన నిఘాను మరింత పెంచింది. ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 8,400 బెట్టింగ్ సంబంధిత వెబ్‌సైట్లు, యాప్స్‌ను నిషేధించింది. అందులో ఒక్క 2025 చట్టం వచ్చాక 4,900 ప్లాట్‌ఫామ్స్‌పై చర్యలు తీసుకోవడం విశేషం. ఇక ఎన్నిసార్లు బ్లాక్ చేసినా కొత్త పేర్లతో వస్తున్న ఈ అక్రమ నిర్వాహకులపై ఐటీ శాఖ మరియు హోం శాఖ కలిసి నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.
0 Comments