Ad Code

వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు-2025 - ఒకే దేశం, ఒకే విద్యా కమిషన్ !


వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు-2025ను పార్లమెంట్ సంయుక్త కమిటీ అధ్యయనం చేస్తోంది. దీనికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నేతృత్వం వహిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు మద్దతు ఇస్తున్న తరుణంలో, ఆయన వదిన అయిన పురందేశ్వరి ఈ బాధ్యతలు చేపట్టడం రాజకీయంగానూ ఆసక్తి కలిగిస్తోంది. భారత ఉన్నత విద్యా రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 'వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు-2025'ను తీసుకురాబోతోంది. దశాబ్దాలుగా విద్యా సంస్థలను నియంత్రిస్తున్న యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌సీటీఈ వంటి సంస్థల స్థానంలో.. 'ఒకే దేశం-ఒకే నియంత్రణ సంస్థ' అనే నినాదంతో ఒకే కేంద్ర కమిషన్‌ను ఏర్పాటు చేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. ప్రస్తుత విద్యా వ్యవస్థలో వివిధ సంస్థల మధ్య సమన్వయ లోపం, మితిమీరిన పేపర్‌వర్క్, నిబంధనల గందరగోళం వల్ల ఉన్నత విద్య కుంటుపడుతోందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు యూజీసీ, ఏఐసీటీఈలు పూర్తి మద్దతు ప్రకటించాయి. 12 మంది సభ్యులతో కూడిన కొత్త కమిషన్ ఏర్పాటు కావడం వల్ల క్రెడిట్ బదిలీలు, ఇంటర్ డిసిప్లినరీ కోర్సులు సులభతరం అవుతాయని, 2035 నాటికి విద్యార్థుల నమోదును 50 శాతానికి పెంచవచ్చని అధికారులు పార్లమెంటరీ కమిటీకి వివరించారు. అయితే, ఈ బిల్లుపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉన్నత విద్యపై రాష్ట్రాలకు ఉన్న అధికారాలను కేంద్రం లాగేసుకుంటోందని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని వారు వాదిస్తున్నారు. వర్సిటీల స్వయంప్రతిపత్తి తగ్గిపోయి, అన్నీ కేంద్రం చేతుల్లోకి వెళ్తాయని విమర్శిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు, విద్యా సంస్థలను మూసివేసే అధికారం కొత్త కమిషన్‌కు ఉండటంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu