భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్ కార్డులో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంటుంది. తాజాగా మరో కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఆధార్ కార్డు ఫోటో కాపీల ద్వారా జరుగుతున్న మోసాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఇకపై జారీ చేసే ఫిజికల్ కార్డులపై సున్నితమైన సమాచారాన్ని తగ్గించాలని నిర్ణయించింది. నివేదికల ప్రకారం భవిష్యత్తులో మనకు అందే ఆధార్ కార్డుపై కేవలం ఫొటో, ఒక QR కోడ్ మాత్రమే కనిపిస్తాయి. పుట్టిన తేదీ, పూర్తి చిరునామా, తండ్రి పేరు వంటి వ్యక్తిగత వివరాలు కార్డుపై ఉండవు. ప్రస్తుతం మనం సిమ్ కార్డులు తీసుకోవడానికైనా, హోటల్ రూమ్ బుకింగ్ కైనా ఆధార్ జిరాక్స్ ఇస్తున్నాం. అందులో ఉన్న పూర్తి వివరాలను సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. అందుకే భౌతిక కార్డును కేవలం ఒక ఫోటో ఐడిగా మాత్రమే మార్చాలని యూఐడీఏఐ ప్రతిపాదించింది. కార్డుపై ఉండే QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా బ్యాంకులు లేదా ప్రభుత్వ సంస్థలు పూర్తి వివరాలను ధృవీకరించుకోవచ్చు. దీనివల్ల ప్రైవసీకి భద్రత ఉంటుంది. ఆధార్ ఫోటోకాపీల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి ఈ కొత్త నియమాలను త్వరలోనే అమలు చేయనుమని యూఐడీఏఐ సీఈఓ భువనేష్ కుమార్ తెలిపారు.
0 Comments