తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కోసం కోఆర్డినేటర్ల జాబితాను టీపీసీసీ విడుదల చేసింది. అయితే అనూహ్యంగా ఈ జాబితాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు కనిపించడం చర్చనీయాంశమైంది. నిజామాబాద్ కార్పొరేషన్ కోఆర్డినేటర్ గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, ఇల్లందు మున్సిపాలిటీకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, షాద్ నగర్ మున్సిపాలిటీకి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్లు టీపీసీసీ లిస్టులో దర్శనిమిచ్చాయి. పైన చెప్పుకున్న ముగ్గురుకి అనర్హత వివాదంలో ఈ ముగ్గురికీ స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం తెలిసిందే. కారు గుర్తు మీద పార్టీ ఫిరాయించారని 10 మందిపై బీఆర్‌ఎస్ తెలంగాణ స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వీళ్లలో ఇప్పటిదాకా కడియం శ్రీహరి, దానం నాగేందర్ తప్ప మిగతా 8 మందికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. వాళ్లు పార్టీ మారారు అనడానికి ఎలాంటి ఆధారాల్లేవని.. టెక్నికల్‌గా ఇంకా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారంటూ తీర్పు ఇచ్చారు. ఈ తరుణంలో.. ఇవాల్టి టీపీసీసీ లిస్ట్ ఆధారంగా స్పీకర్ తీర్పును బీఆర్‌ఎస్ తప్పుబట్టే అవకాశం లేకపోలేదు.
0 Comments