తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరో మూడు నెలల్లో కొత్త రాజకీయ పార్టీ పేరును, విధివిధానాలను వెల్లడించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీపై, ఆ పార్టీ అగ్రనేతలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తన రాజకీయ భవిష్యత్తుపై కవిత క్లారిటీ ఇస్తూ "నాకు సెంటిమెంట్లు ఎక్కువ. అందుకే మంచి ముహూర్తం చూసి పార్టీని ప్రకటిస్తాను. నా బలం ఏంటో త్వరలోనే అందరికీ అర్థమవుతుంది. ప్రజలే నన్ను నాయకురాలిగా తీర్చిదిద్దాలి" అని పేర్కొన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వల్ల తనకు ఒరిగిందేమీ లేదని వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న కేటీఆర్ కేవలం సిరిసిల్ల నియోజకవర్గానికే ఎందుకు పరిమితమయ్యారని ప్రశ్నించారు. జాగృతి సంస్థ పోటీ చేస్తున్న ప్రాంతాల్లో హరీశ్ రావు ఎందుకు తిరుగుతున్నారని ఆమె నిలదీశారు. ముఖ్యనేతలు ప్రచారానికి రాకపోవడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. తనపై విమర్శలు చేసే వారిని 'గుంట నక్కలు, గూఢాచారులు' అని సంబోధిస్తూ కవిత ఘాటుగా స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు సహజమని, కానీ వ్యక్తిగత ఆరోపణలు చేస్తే తాను మౌనంగా ఉండబోనని హెచ్చరించారు. రాబోయే మూడు నెలల్లో తన రాజకీయ వ్యూహం మరింత స్పష్టంగా ఉంటుందని, తెలంగాణలో కొత్త రాజకీయ చర్చకు తెరలేపుతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
0 Comments