అమెరికాకు వాణిజ్య ఒప్పందం పేరుతో మోడీ ప్రభుత్వం అమ్ముడుపోయిందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ ఒప్పందంపై ఆదివారం రాహుల్‌గాంధీ ప్రధాని మోడీకి పలు ప్రశ్నలు సంధించారు. " ఈ అంశం భవిష్యత్తుకు సంబంధించినది. మరో దేశం మన దేశ వ్యవసాయ రంగంపై దీర్ఘకాలికంగా పట్టు సాధించడానికి భారతదేశం అనుమతిస్తుందా" అని ప్రధాని మోడీని నిలదీశారు. భారత్ డ్రైడ్ డిస్టిల్లర్స్ గ్రెయిన్స్‌లను దిగుమతి చేసుకుంటుందని, అంటే దానర్థం భారతీయ పశువులకు అమెరికా జన్యుమార్పిడి మొక్కజన్నతో తయారు చేసిన డ్రైడ్ డిస్టిల్లర్స్ గ్రెయిన్స్ (డిడిజి)ని దాణాగా వేస్తారా, ఇది మనదేశ పాల ఉత్పత్తులను అమెరికా వ్యవసాయ పరిశ్రమపై ఆధారపడేలా చేయదా అని ప్రశ్నించారు. అలాగే ప్రభుత్వం జన్యుమార్పిడి సోయా నూనెను దిగుమతికి అనుమతించిందని, ఇది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సోయా రైతులపై ప్రభావం చూపదా అని ప్రశ్నించారు. మరోసారి ధరల షాక్‌ను రైతులు ఎలా తట్టుకోగలరని కేంద్రాన్ని నిలదీశారు. ఒప్పందంలో మీరు 'అదనపు ఉత్పత్తులు' అని కూడా ప్రకటించారని, వాటిలో ఏమి ఉంటాయని ప్రశ్నించారు. భవిష్యత్తులో పప్పుధాన్యాలు, ఇతర పంటల్లో అమెరికా దిగుమతులను అనుమతించాలనే ఒత్తిడిని ఇది సూచిస్తుందా అని నిలదీశారు. వాణిజ్యేతర అడ్డంకులను తొలగించడమంటే భవిష్యత్తులో భారతదేశం జన్యుమార్పిడి పంటలపై తన వైఖరిని సడలించడానికి, సేకరణను బలహీనపరచడానికి లేదా కనీస మద్దతుధర, బోనస్‌లను తగ్గించేలా ఒత్తిడి చేస్తుందా అని ప్రశ్నించారు. ఒకసారి దిగుమతులకు ద్వారాలు తెరిస్తే, ప్రతి ఏడాది దానిని విస్తృతంగా అనుమతించకుండా నిరోధించడం కష్టతరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని నిరోధించవచ్చా, లేదా ప్రతిసారీ క్రమంగా మరిన్ని పంటలను దిగుమతికి అనుమతిస్తారా, రైతులకు ఈ స్పష్టతనివ్వాలని అన్నారు. ఈ అంశం కేవలం ప్రస్తుత సమస్య కాదని, భవిష్యత్తుకు సంబంధించిన అంశమని అన్నారు. భారతదేశ వ్యవసాయ పరిశ్రమపై దీర్ఘకాలిక పట్టు సాధించడానికి మరో దేశాన్ని మనం అనుమతిస్తున్నామా అని ఆందోళన వ్యక్తం చేశారు.
0 Comments