మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ విచారించిన అనంతరం సజ్జనార్ తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ట్వీట్‌ను ఆధారంగా చేసుకుని బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగుతోంది. ఈ సిట్‌కు చీఫ్‌గా వ్యవహరిస్తున్న సజ్జనార్, ఇటీవల మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ విచారణ పూర్తైన తర్వాత, 'అక్రమ ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కేసులో కె. చంద్రశేఖర్ రావును సిట్ ప్రశ్నించడం పూర్తయింది' అంటూ సజ్జనార్ ట్వీట్ చేయడం వివాదానికి దారి తీసింది. ఈ ట్వీట్‌లో కేసీఆర్‌ను 'గారు' అని సంబోధించకపోవడం, అలాగే ప్రతిపక్ష నేతగా ఆయన హోదాను ప్రస్తావించకపోవడంపై బీఆర్ఎస్ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు, విచారణ ఇంకా కొనసాగుతున్న దశలోనే 'అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు' అని పేర్కొనడం ద్వారా సిట్ చీఫ్ ముందుగానే ఒక అభిప్రాయానికి వచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. సజ్జనార్ జడ్జి కాదని, ఆయన కేవలం ఒక పోలీసు అధికారి మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ అక్రమమా కాదా అనే విషయాన్ని నిర్ణయించేది కోర్టులేనని, అధికారులు ట్వీట్లు, లీక్‌ల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించకూడదని హెచ్చరించారు. చట్టపరమైన స్పష్టత లేకుండానే ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి హరీశ్ రావు కూడా సజ్జనార్ ట్వీట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విచారణ పూర్తై, న్యాయస్థానాలు తుది తీర్పు ఇవ్వకముందే ఫోన్ ట్యాపింగ్‌ను 'అక్రమం'గా ఎలా పేర్కొంటారని ప్రశ్నించారు. ఆల్ ఇండియా సర్వీసెస్ కండక్ట్ రూల్స్‌కు విరుద్ధంగా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఇలా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఈ కేసులో సిట్ చీఫ్ ముందే అభిప్రాయం ఏర్పరుచుకున్నట్లుగా కనిపిస్తోందని ఆరోపించారు.
0 Comments