రాబోయే రోజుల్లో రిలయన్స్ షేర్ ధర 28% లాభాలను అందుకోవచ్చని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేస్తోంది. రిలయన్స్ కేవలం టెలికాం, రిటైల్ రంగాలకే పరిమితం కాకుండా.. ఇప్పుడు కృత్రిమ మేధ రంగంలోకి భారీగా అడుగుపెట్టడం ఇన్వెస్టర్లలో ఆశలు రేకెత్తిస్తోంది. కృత్రిమ మేధలో రాబోయే ఏడేళ్లలో దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ముఖేష్ అంబానీ ఇటీవల ప్రకటించారు. డిజిటల్ మౌలిక సదుపాయాలు, క్లీన్ ఎనర్జీ సేవలపై రిలయన్స్ కంపెనీ చూపిస్తున్న శ్రద్ధ వల్ల బ్రోకరేజ్ సంస్థలు ఈ కంపెనీపై సానుకూలంగా ఉన్నాయి. మోర్గాన్ స్టాన్లీ రిలయన్స్ షేర్‌ను తన 'టాప్ పిక్' జాబితాలో చేర్చింది. ప్రస్తుతం ఉన్న ధర నుంచి పెరిగి, షేర్ విలువ రూ.1,803కి చేరుకోవచ్చని అంచనా వేసింది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి రిలయన్స్ షేర్ ధర సుమారు రూ.1419.10 వద్ద ఉంది. ఈ పెరుగుదల అంచనా నిజమైతే ఇన్వెస్టర్లకు భారీ లాభాలు వస్తాయి. గత ఐదేళ్లలో రిలయన్స్ స్టాక్ తన ఇన్వెస్టర్లకు దాదాపు 37 శాతం రాబడిని అందించిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. గత ఏడాది కాలంలోనే ఈ షేర్ 15.55 శాతం వృద్ధిని సాధించింది. ప్రస్తుత మార్కెట్ విలువల ప్రకారం రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.19.21 లక్షల కోట్లుగా ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద కంపెనీగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటోంది.
0 Comments