అస్సాంలోని కామ్‌రూప్‌లో పోలీస్ 10వ బెటాలియన్ కొత్త క్యాంపస్‌కు శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ అక్రమ వలసదారులను కేవలం ఓటర్ల జాబితా నుంచే కాకుండా దేశం నుంచే తొలగిస్తామని అన్నారు. నక్సలిజం నుంచి దేశం త్వరలోనే విముక్తి పొందుతుందని, అలాగే చొరబాటుదారుల ఏరివేత కూడా జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. చొరబాటుదారులను వారు ఆక్రమించిన స్థలాల నుంచి తరిమికొట్టినంత మాత్రాన సమస్య తీరిపోదని, వారు మరో చోట స్థిరపడే అవకాశం ఉందని అమిత్ షా అన్నారు. వారిని మొత్తంగా దేశం నుంచి బయటకు తరిమేస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. అక్రమ వలసదారులను బహిష్కరిస్తామని గతంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారని, కానీ కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయబోదని స్పష్టం చేశారు. చొరబాటుదారులే కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ అని, వారిని రక్షించాలనేదే హస్తం పార్టీ విధానమని విమర్శించారు. చొరబాటుదారుల విషయంలో కాంగ్రెస్ విధానాలే అస్సాంకు ముప్పుగా మారాయని అమిత్ షా విమర్శించారు. చొరబాటుదారులపై చర్యలు తీసుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉంటే, ఎన్నికల మేనిఫెస్టోలో ఆ విషయాన్ని పొందుపర్చాలని సవాల్ విసిరారు. రానున్న ఐదేళ్లలో ఈశాన్య భారతంలో అస్సాం పారిశ్రామిక కేంద్రంగా ఎదుగుతుందని అన్నారు.
0 Comments