జింబాబ్వే లోని హరారే వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి భారత యువ జట్టు ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. టీమిండియా యువ ఆటగాళ్లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి రూ. 7.5 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించింది. శుక్రవారం జరిగిన ఫైనల్ పోరులో భారత్ 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 411 పరుగుల భారీ స్కోరు సాధించింది. కేవలం 14 ఏళ్ల వయసున్న యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ ఆయుష్ మాత్రే 53 పరుగులు చేయగా.. వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుందు 40 పరుగులు జోడించాడు. 148 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ జట్టులో కాలెబ్ ఫాల్కనర్ (115) సెంచరీతో పోరాడినప్పటికీ, భారత బౌలర్ల ధాటికి ఆ జట్టు కుప్పకూలింది. ఈ విజయంతో టీమిండియా రికార్డు స్థాయిలో ఆరోసారి టైటిల్‌ను ముద్దాడింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా శనివారం ఈ భారీ నగదు బహుమతిని ప్రకటించారు. "జింబాబ్వే, నమీబియాలో జరిగిన అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు రూ. 7.5 కోట్ల నగదు బహుమతిని అందజేస్తున్నాం. ఈ మొత్తాన్ని ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్, సెలక్షన్ కమిటీకి ఎలా పంపిణీ చేయాలనే దానిపై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నాం" అని ఆయన తెలిపారు.
0 Comments