అబుదాబి నుంచి అహ్మదాబాద్ వచ్చిన ప్రయాణీకుడు నుంచి సుమారు 22 లక్షల రూపాయల విలువైన బంగారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అబుదాబి నుండి ఎయిర్ అరేబియా ఫ్లైట్ లో షారూఖ్ అనే వ్యక్తి అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు అతడి కదలికలపై అనుమానం వచ్చి అడ్డుకున్నారు. మొదట ఏమీ లేదని బుకాయించినప్పటికీ గట్టిగా విచారించేసరికి తానే స్వయంగా బంగారాన్ని మింగినట్లు ఒప్పుకున్నాడు. ఇలా శరీరంలో లోహపు వస్తువులను దాచుకోవడం ప్రాణాలకే ప్రమాదమని తెలిసినా డబ్బు మీద ఆశతో ఈ సాహసం చేశాడు. నిందితుడి వాంగ్మూలం తర్వాత కోర్టు అనుమతితో అతడిని వెంటనే అహ్మదాబాద్ లోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఎక్స్-రే , స్కాన్ నిర్వహించగా కడుపులో ఏవో వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. రెండు రోజుల పాటు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచిన తర్వాత, మల విసర్జన ద్వారా మూడు పసుపు రంగు క్యాప్సూల్స్, ఒక స్టీల్ బంతి బయటకు వచ్చాయి. నిందితుడి ఆరోగ్యం క్షీణించకుండా వైద్యులు ఎంతో జాగ్రత్తగా ఈ ప్రక్రియను పూర్తి చేశారు. అధికారులు ఆ వస్తువులను పరీక్షించి, అవి 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు బిస్కెట్లు అని తేల్చారు. మొత్తం 135.20 గ్రాముల బరువున్న ఈ బంగారం మార్కెట్ విలువ సుమారు రూ. 21,89,564 గా నిర్ధారించారు. నాలుగో వస్తువు మాత్రం సాధారణ లోహంతో చేసిన బంతిగా గుర్తించారు. కస్టమ్స్ చట్టం 1962 నిబంధనల ప్రకారం ఈ బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు.
0 Comments