జర్మనీలోని మ్యూనిచ్‌లో జరుగుతున్న అంతర్జాతీయ భద్రతా సదస్సుకు హాజరైన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌కు ఓ ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఓ సెక్యూరిటీ అధికారి ఆయన తన గుర్తింపు కార్డును సరిగా చూపించలేదని అభ్యంతరం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మునీర్ సదస్సు ప్రాంగణంలోకి ప్రవేశించడానికి కొద్ది క్షణాల ముందు ఈ ఘటన జరిగింది. అసిమ్ మునీర్ మెడలో ఐడీ కార్డు లేకపోవడంతో సెక్యూరిటీ అధికారి ఆయనను ఆపారు. దాంతో మునీర్ పక్కనున్న మరో పాక్ సైనికాధికారి తన చేతిలో ఉన్న కార్డును చూపించడంతో సెక్యూరిటీ అధికారి వారిని లోపలికి వెళ్లేందుకు అనుమతించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఘటనపై పలువురు విమర్శకులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. అంతర్జాతీయ వేదికలపై ఆయనకున్న గౌరవం ఇదేనంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు అసిమ్ మునీర్‌ను ఇలాంటి సదస్సులకు ఆహ్వానించడం ఏంటంటూ పలువురు నేతలు విమర్శలు చేస్తున్నారు.
0 Comments