అమెరికా లోని లాస్ ఏంజిల్స్ నగర రాజకీయాల్లో నిత్య రామన్ పేరు మారుమోగుతోంది. భారతీయ సంతతికి చెందిన నిత్య లాస్ ఏంజిల్స్ నగర పాలక మండలి సభ్యురాలు. ప్రస్తుతం మేయర్ పదవికి పోటీ పడుతున్నారు. కేరళలో జన్మించిన నిత్య రామన్, ఢిల్లీ , చెన్నైలలో తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటూ, నీరు, ప్లంబింగ్ , ఆశ్రయం వంటి ప్రాథమిక అవసరాల కష్టాలు పడింది. ఆమెకు ఆరేళ్ల వయసులోనే కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. 44 ఏళ్ల నిత్య ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ థియరీలో డిగ్రీ, మిట్ నుండి అర్బన్ ప్లానింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. రాజకీయాల్లోకిరాకముందు ఆమె అర్బన్ ప్లానర్ గా పని చేశారు. 2020లో లాస్ ఏంజిల్స్ సిటీ కౌన్సిల్ (డిస్ట్రిక్ట్ 4)కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. లాస్ ఏంజిల్స్ సిటీ కౌన్సిల్‌కు ఎన్నికైన మొదటి దక్షిణాసియా మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ప్రస్తుత మేయర్ కరెన్ బాస్ కు వ్యతిరేకంగా ఆమె రంగంలోకి దిగడం అమెరికా రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తన ఎన్నికల ప్రచారంలో "లాస్ ఏంజిల్స్ ఒక కీలక దశలో ఉంది, మార్పు అత్యవసరం" అని పిలుపుతో నిత్య ముందు కెళుతున్నారు. ప్రధానంగా నివాస గృహాల కొరత, నిరాశ్రయుల సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టారు. నగరంలో అందరికీ అందుబాటులో ఉండే ఇళ్లను అందించాలని ఆమె పోరాడుతున్నారు. పర్యావరణ మార్పులపై ఆమె చేస్తున్న కృషికి గాను 'సియెర్రా క్లబ్' వంటి సంస్థల నుండి అవార్డులు అందుకున్నారు.
0 Comments