తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సింగరేణి ప్రాంతంలో ఇండ్ల స్ధలాలకు సంబంధించి జీఓ 79ను పరిష్కరించి ప్రజలకు మేలు చేస్తామన్నారు. ఇప్పటికే ఈ ఇండ్ల స్ధలాల సమస్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూపాలపల్లి సభలో స్పష్టమైన హామీ ఇచ్చారని, కార్మిక పక్షపాతిగా నిలిచిన తమ ప్రభుత్వం వారికి న్యాయం చేస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే నుంచి ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి వరకు అందరూ కాంగ్రెస్ ప్రతినిధులేనని, ఈ ప్రాంత అభివృద్ది కోసం కాంగ్రెస్, మిత్రపక్ష అభ్యర్దులను గెలిపించి అభివృద్ది ఫలాలను అందుకోవాలని పిలుపునిచ్చారు. కొత్తగూడెం పరిధిలోని 60 డివిజన్లలో 58 చోట్ల కాంగ్రెస్, 2 చోట్ల సీపీఎం అభ్యర్ధులు పోటీ చేస్తున్నారని, వీరందరినీ గెలిపించాలని మంత్రి పొంగులేటి కోరారు. కొత్తగూడెం ప్రాంతంలోని రోడ్లు, డ్రైనేజీ, వంతెనల నిర్మాణం, ఎంతోకాలంగా ఇక్కడి ప్రజలను వేధిస్తున్న మంచినీటి సమస్య తీరి 24 గంటలూ సరఫరా కావాలన్నా కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించాలని కోరారు. ఇవేగాక యువతకు ఉపాధి కల్పనా కార్యక్రమాలు, ప్రభుత్వ హాస్పిటల్‌లో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించే బాథ్యత తీసుకుంటానని ప్రకటించారు. 11న పోలింగ్ జరగనున్నందున ఈ రెండు రోజులు కార్యకర్తలు మరింత కష్టపడాలని, ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని సూచించారు. కొత్తగూడెం నా సొంత గడ్డ- కాంగ్రెస్ అడ్డా అని చెబుతూ రంగుల రంగుల కండువాలు కప్పుకొని శీనన్న మాకు తెలుసు అంటూ వచ్చే వారిని నమ్మవద్దని మంత్రి పొంగులేటి కోరారు. ఏప్రిల్ నుంచి మరో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, అర్హులైన పేదలకు ఇంటిస్ధలంతోపాటు ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు.
0 Comments