ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఆరు కోట్ల విలువైన గంజాయి పట్టుపడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరి ప్రయాణికుల ప్రవర్తనపై అధికారులకు అనుమానం కలిగింది. దీంతో వారి లగేజీ బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేయగా భారీగా గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. అక్రమంగా తరలిస్తున్న 6 కిలోల అత్యంత ఖరీదైన గంజాయిని అధికారులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. వాటి విలువ సుమారు రూ.6 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు. బ్యాంకాక్ నుంచి పెద్దమొత్తంలో డ్రగ్స్ ను తరలించిన ఇద్దరిని అధికారులు అరెస్ట్ చేశారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్స్ చట్టం కింద వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. వీరు కేవలం కొరియర్లుగా మాత్రమే పనిచేస్తున్నారా లేక ఏదైనా పెద్ద డ్రగ్స్ ముఠాతో వీరికి సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. థాయ్‌లాండ్‌లో గంజాయి సాగు చట్టబద్ధం అయినప్పటి నుండి, అక్కడి నుండి భారత్‌కు డ్రగ్స్ అక్రమ రవాణా పెరుగుతోందని అధికారులు గుర్తించారు. దీనివల్ల బ్యాంకాక్ నుండి వచ్చే విమానాలపై కస్టమ్స్ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. అయితే అక్కడ వైద్య అవసరాల నిమిత్తమే గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
0 Comments