ఛత్తీస్‌గఢ్ జిల్లా బస్తర్ డివిజన్‌లో 51 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై రూ.1.61 కోట్ల రివార్డు ఉంది. వీరంతా బస్తర్ ఎస్పీ జితేందర్ యాదవ్ సమక్షంలో శనివారంనాడు లొంగిపోయారు. బస్తర్ జిల్లా ప్రధాన కార్యాలయమైన జగదల్‌పూర్‌లో బస్తర్ పాండుమ్ 2026 ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి అమిత్‌షా రాయపూర్ వచ్చిన రోజునే ఇంత పెద్దసంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, జిజాపూర్ జిల్లాలో 20 మంది మహిళా క్యాడర్‌తో సహా 30 మంది మావోయిస్టులు లొంగిపోయారని, మరో 21 మంది సుక్మా జిల్లాలో లొంగిపోయారని ఎస్సీ సుందరరాజ్ తెలిపారు. వీరిలో 14 మంది మహిళా క్యాడర్ ఉన్నారని చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టుల నుంచి కార్డెక్స్ వైర్‌లు, జెలటిన్ స్టిక్‌లో స్వాధీనం చేసుకున్నామన్నారు. లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు 50 వేల తక్షణ ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పునరావాస చర్యలతో స్వచ్ఛందంగా వీరంతా లొంగిపోయినట్టు చెప్పారు. కాగా, తక్కిన మావోయిస్టు క్యాడర్ కూడా హింసను విడనాడి జనజీవన స్రవంతిలో కలవాలని, వారికి భద్రత, గౌరవంగా జీవించేందుకు అవసరమైన పునరావసం కల్పిస్తామని సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ కోరారు.
0 Comments