క్యరాజ్యసమితిని ఆదుకునేందుకు తన 2026 ఏడాది బకాయిలను భారత్ సకాలంలో చెల్లించింది. మొత్తం 35.187 మిలియన్ డాలర్లను (సుమారు రూ. 290 కోట్లు) జమ చేయడం ద్వారా ఐరాస ప్రకటించే ప్రతిష్టాత్మక 'ఆనర్ రోల్' జాబితాలో భారత్ చోటు దక్కించుకుంది. అగ్రరాజ్యం అమెరికా సహా పలు అభివృద్ధి చెందిన దేశాలు తమ వాటా నిధులను సకాలంలో చెల్లించకపోవడంతో ఐరాస ప్రస్తుతం ఆర్థిక పతనం అంచున ఉంది. ఈ విషయాన్ని సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ స్వయంగా హెచ్చరించిన తరుణంలో, భారత్ తన నిధులను ముందుగానే విడుదల చేసి తన నిబద్ధతను చాటుకుంది. నిబంధనల ప్రకారం నోటీసు అందిన 30 రోజుల్లోపు నిధులు చెల్లించే దేశాలకు మాత్రమే 'ఆనర్ రోల్'లో చోటు లభిస్తుంది. ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 47 దేశాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి. ఈ సందర్భంగా ఐరాస ప్రతినిధి స్టెఫాన్ దుజారిక్ విలేకరులతో మాట్లాడుతూ భారత్‌ను వినూత్నంగా ప్రశంసించారు. "ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం ఉన్న దేశం ఏది?" అంటూ క్విజ్ నిర్వహించి, భారత్ తన బకాయిలను పూర్తిగా చెల్లించిందని ప్రకటించారు. ఐరాస రోజువారీ కార్యకలాపాల కోసం భారత్ తన వంతుగా 1.016 శాతం నిధులను కేటాయిస్తోంది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై అంతర్జాతీయంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.