ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన గ్రూప్-సీ మ్యాచ్‌లో ఇటలీ జట్టు నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా కేవలం 12.4 ఓవర్లలోనే ఛేదించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు 19.3 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌట్ అయింది. నేపాల్ బ్యాటర్లలో ఆరిఫ్ షేక్ 27 పరుగులు, రోహిత్ పౌడెల్ 23 పరుగులు, ఆసిఫ్ షేక్ 20 పరుగులు చేసి జట్టుకు కీలక పరుగులను రాబట్టారు. చివర్లో కరణ్ కేసీ 18 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇటలీ బౌలర్లలో క్రిషన్ కలుగమాగే 3 వికెట్లు తీసి నేపాల్ బ్యాటింగ్ లైనప్ ను కూల్చేశాడు. దీనితో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అలాగే బెన్ మనేంటి 2 వికెట్లు తీసి అతనికి మంచి సహకారం అందించాడు. 124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇటలీకి ఓపెనర్లు అద్భుత ఆరంభం అందించారు. జస్టిన్ మోస్కా 60 (44 బంతులు), ఆంథోనీ మోస్కా 62 (32 బంతులు) నాటౌట్ ఇన్నింగ్స్ తో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు అజేయ భాగస్వామ్యం నమోదు చేసి నేపాల్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీనితో ఇటలీ 10 వికెట్లతో అద్భుత విజయం సాధించింది.
0 Comments