టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్ వేదికగా జరిగే తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన విజ్ఞప్తికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిరాకరించినట్లు తెలుస్తోంది. మెగా టోర్నీకి తక్కువ సమయం ఉండటంతో వేదికల తరలింపు సాధ్యం కాదని బీసీబీకి ఐసీసీ స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే జనవరి 21లోపు భారత్‌కు వచ్చేది రానిది తేల్చుకోవాలని బీసీబీకి ఐసీసీ డెడ్‌లైన్ విధించినట్లు ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో పేర్కొంది. అయితే ఈ విషయంపై ఐసీసీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఒకవేళ బంగ్లాదేశ్ మొండిపట్టుతో ఉంటే టోర్నీ నుంచి తప్పించనున్నారు. బంగ్లా స్థానంలో తదుపరి ర్యాంక్ కలిగిన స్కాట్లాండ్ జట్టు వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. ఫిబ్రవరి 7 నుంచి 8 వరకు జరిగే టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే భద్రతా కారణాలను సాకుగా చూపుతూ బంగ్లాదేశ్ తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలని ఐసీసీకి లేఖ రాసింది. ఫిబ్రవరి 7 నుంచి టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఇంత తక్కువ సమయంలో వేదికలను తరలించడం సాధ్యం కాదని ఐసీసీ చెబుతోంది. అయినా బీసీబీ మొండి పట్టు వీడటం లేదు. ఈ క్రమంలోనే ఢాకాలో జరిగిన సమావేశంలో బీసీబీకి ఐసీసీ డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ జట్టు భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లదని ఐసీసీ హామీ ఇచ్చినట్లు సమాచారం.
0 Comments