సింగరేణి బొగ్గు గనుల టెండర్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయంటూ నేడు గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న సింగరేణి బొగ్గు కుంభకోణంపై గవర్నర్ చర్యలు తీసుకోవాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడికి దోచిపెట్టింది సరిపోలేదని, ఇప్పుడు బావుమరిది కళ్లల్లో ఆనందం చూసేందుకు సింగరేణి బొగ్గు కాంట్రాక్టులను కట్టబెడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. సింగరేణిని అవినీతికి అడ్డాగా మార్చారని, పారదర్శకత లేకుండా టెండర్ల ప్రక్రియలో 'సైట్ విజిట్ సర్టిఫికెట్' అనే కొత్త నిబంధనను తెరపైకి తెచ్చి వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆయన విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రవేశపెట్టిన నిబంధనల వెనుక సీఎం కుటుంబ సభ్యుల హస్తం ఉందని, సీఎం 'కోల్ మాఫియా'కు నాయకుడిగా మారారని కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒడిశాలోని నైనీ బ్లాక్ బొగ్గు వెలికితీత టెండర్లలో అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. గతంలో లాభాల్లో ఉన్న సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వీర్యం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యంగా 35 వేల కోట్ల విలువైన బొగ్గు గనుల కాంట్రాక్టులను తమకు నచ్చిన వ్యక్తులకు కట్టబెట్టేందుకే నిబంధనలను తుంగలో తొక్కారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. సైట్ విజిట్ పేరిట అనర్హులైన గుత్తేదారులకు అనుమతులు ఇస్తూ, అర్హులైన వారిని పక్కన పెట్టారని వారు పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సూత్రధారిగా వ్యవహరించారని బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ప్రజాధనాన్ని లూటీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సీఎం రేవంత్ రెడ్డికి పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. గవర్నర్‌ను కలిసిన తర్వాత న్యాయపరమైన పోరాటానికి కూడా సిద్ధమవుతామని సంకేతాలు ఇచ్చారు. కాగా, ఈ ఆరోపణలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖండిస్తోంది. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగానే జరిగిందని, రాజకీయ దురుద్దేశంతోనే బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోందని మంత్రులు అంటున్నారు. సాక్ష్యాధారాలను గవర్నర్‌కు సమర్పించి, కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. సింగరేణి కార్మికుల ప్రయోజనాలను కాపాడటమే తమ ధ్యేయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
0 Comments