బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, దర్యాప్తును తప్పుదోవ పట్టించారనే ఆరోపణలతో భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గత నవంబర్‌లోనే ఈ నోటీసులు ఇచ్చినా, తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థకు చెందిన సుమారు 177 మిలియన్ డాలర్ల (దాదాపు ₹1,475 కోట్లు) విలువైన స్టాక్ విక్రయాల బాధ్యతను బ్యాంక్ ఆఫ్ అమెరికా చేపట్టింది. ఈ విక్రయ ప్రక్రియ జరుగుతున్న సమయంలో, స్టాక్ ధర మరియు ఇతర అత్యంత రహస్య వివరాలను బ్యాంక్ డీల్ టీమ్ ముందే కొంతమంది ఇన్వెస్టర్లతో పంచుకుందని ఓ 'విజిల్ బ్లోయర్' ఫిర్యాదు చేశారు. తొలుత బ్యాంక్ ఆఫ్ అమెరికా తన అంతర్గత దర్యాప్తులో ఎలాంటి తప్పూ జరగలేదని క్లీన్ చిట్ ఇచ్చుకుంది. కానీ సెబీ లోతుగా విచారణ జరపగా కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. ఇన్సైడర్ ట్రేడింగ్‌ను అరికట్టేందుకు ఉండాల్సిన అంతర్గత నైతిక కట్టుబాట్లను బ్యాంక్ పక్కన పెట్టినట్లు సెబీ గుర్తించింది. వాస్తవాలను దాచిపెట్టి, తప్పుడు స్టేట్‌మెంట్లతో అధికారులను అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేశారని సెబీ ఆరోపించింది. ఈ వ్యవహారం ముదిరిపోవడంతో, కోర్టుల చుట్టూ తిరగకుండా సెబీ వద్ద 'సెటిల్‌మెంట్ అప్లికేషన్' దాఖలు చేసి ఈ వివాదాన్ని ముగించాలని బ్యాంక్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి అంతర్జాతీయ బ్యాంకులు నిబంధనలు ఉల్లంఘించడం వల్ల మార్కెట్ పారదర్శకతపై ఇన్వెస్టర్లకు నమ్మకం తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు.
0 Comments