ధురంధర్ సినిమాలో నటుడు నదీమ్ ఖాన్ తన ఇంట్లో పనిచేసే 41 ఏళ్ల మహిళపై దాదాపు పదేళ్లుగా లైంగిక దాడులకు పాల్పడ్డాడన్న ఆరోపణల నేపధ్యంలో ముంబై పోలీసులు ఆయనను అరెస్టు చేశా రు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు శారీరకంగా వాడుకున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. బాధితురాలు గతంలో పలువురు సినీ ప్రముఖుల ఇళ్లలో పనిమనిషిగా పనిచేసిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే కొన్ని సంవత్సరాల క్రితం నదీమ్ ఖాన్‌తో పరిచయం ఏర్పడిందని, పెళ్లి హామీ ఇవ్వడంతో ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం కొనసాగిందని బాధితురాలు వాపోయింది. మాల్వానీలోని తన నివాసంలోనూ, వెర్సోవాలోని నదీమ్ ఖాన్ ఇంట్లోనూ పలుమార్లు తనపై లైంగిక దాడి జరిగిందని ఫిర్యాదులో పేర్కొంది. ఇన్నేళ్లుగా భయంతో, సమాజంలో పరువు పోతుందని విషయాన్ని బయటకు చెప్పలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లి విషయమై ఇటీవల నిలదీయడంతో అతడు స్పష్టంగా నిరాకరించాడని అందుకే పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపింది. అంతేకాకుండా తనను మానసికంగా కూడా వేధించాడని ఆమె ఆరోపించింది. కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు మొదటగా వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత మాల్వానీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగినందున కేసును అక్కడికి బదిలీ చేశారు. దర్యాప్తు అనంతరం నదీమ్ ఖాన్‌ను అరెస్ట్ చేసినట్టు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు. కేసుకు సంబంధించిన మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
0 Comments