Ad Code

నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు మృతి


హైదరాబాద్‌లోని నాంపల్లి అగ్నిప్రమాద ఘటనలో ఐదుగురు మృతి చెందారు. నిన్న అగ్నిప్రమాదం చోటు చేసుకోగా 22 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. దట్టమైన పొగల కారణంగా రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమైంది. మంటల్లో చిక్కుకున్న ఐదు మృతదేహాలను గుర్తించి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిలో అఖిల్ (7), ప్రణీత్ (11) ఉన్నారు. మిగిలిన వారు  హాబీబ్ (35), ఇంతియాజ్ (32), బేబీ (43)గా గుర్తించి మృతదేహాలను మార్చురీకి తరలించారు. రద్దీ ప్రాంతమైన నాంపల్లిలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక ఫర్నిచర్ షోరూమ్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే భవనం మొత్తానికి వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నాంపల్లి ప్రధాన రహదారిపై ఉన్న ఒక నాలుగు అంతస్తుల కమర్షియల్ భవనంలో ఈ ప్రమాదం సంభవించింది. భవనం కింద ఉన్న సెల్లార్‌లోని హోల్‌సేల్ ఫర్నిచర్ షాపులో మొదట మంటలు ప్రారంభమయ్యాయి. లోపల ఫర్నిచర్ సామాగ్రి అధికంగా ఉండటంతో మంటలు వేగంగా పై అంతస్తుల వరకు వ్యాపించాయి. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేయడంతో జనం పరుగులు తీశారు. ప్రమాద సమయంలో భవనంలో పలువురు చిక్కుకున్నట్లు వార్తలు రావడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. అయితే, అగ్నిమాపక సిబ్బంది రాకముందే స్థానిక యువకులు సాహసించి భవనంలోకి వెళ్లి కొంత మంది పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. భవనంలోని మిగిలిన కుటుంబాలను, పక్కనే ఉన్న రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లోని నివాసితులను అధికారులు వెంటనే ఖాళీ చేయించారు. 

Post a Comment

0 Comments

Close Menu