Ad Code

బాలుడిని ఢీకొట్టిన చేపల ట్రక్ : మానవత్వం మరచి చేపల కోసం ఎగబడ్డ జనం


బీహార్‌లోని సీతామర్హి జిల్లా, పుప్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝాఝీహట్ గ్రామంలో ఏడో తరగతి విద్యార్థి రితేష్ కుమార్ అలియాస్‌ గోలు పొద్దున్నే ప్రైవేట్‌కు వెళుతున్నాడు. ఇంతలో వేగంగా దూసుకు వచ్చిన ఒక చేపల్ని రవాణా చేసే పికప్ ట్రక్కు అతడిని బలంగా ఢీకొట్టింది. దీంతో అతను అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఢీకొన్న ధాటికి, సమీపంలో ఉన్న వారు బెంబేలెత్తి కేకలు వేశారు. కొద్దిసేపటికే బాలుడి రితేష్ తండ్రి సంతోష్‌ దాస్‌, ఇతర కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని విగతజీవిగా మారిన బిడ్డను చూసి తీవ్ర దుఃఖంతో కుప్పకూలిపోయారు.  ప్రమాదం జరిగిన తర్వాత చేపలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఒక పక్క విద్యార్థి తల్లిదండ్రులు దుఃఖంతో విలపిస్తోంటే, రోడ్డుకు అవతలి వైపు జనాలు చేపలను అందిన కాడికి దోచుకోవడం ప్రారంభించారు. ఆ చిన్నారి మృతదేహం సమీపంలోనే పడి ఉండగా, కొందరు వ్యక్తులు సంచులలో చేపలను నింపుకుని, మరికొందరు చేతులతో చేపలను పట్టుకుని పారిపోవడం విచారకరం. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, పుప్రి పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గుంపును చెదరగొట్టారు. రితేష్ మృతదేహాన్ని ఆధీనంలోకి తీసుకుని, పోస్ట్‌మార్టం కోసం పంపారు. ప్రమాదానికి కారణమైన పికప్ ట్రక్కును స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment

0 Comments

Close Menu