Ad Code

అమెరికాలో డ్రగ్స్ సరఫరా, వ్యభిచారం నడుపుతున్న భారత సంతతి దంపతుల అరెస్ట్


మెరికాలోని ఉత్తర వర్జీనియా, డమ్‌ఫ్రైస్ ప్రాంతంలో ఒక మోటల్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా, వ్యభిచార ముఠాను నడుపుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ జంటను అమెరికా ఫెడరల్ అధికారులు అరెస్టు చేశారు.  కోషా శర్మ (52 ), తరుణ్ శర్మ (55 ) కలిసి 'కోషా ఎల్‌ఎల్‌సీ' అనే సంస్థ ద్వారా 'రెడ్ కార్పెట్ ఇన్' అనే మోటల్‌ను నడుపుతున్నారు. అయితే ఈ హోటల్ కేవలం ప్రయాణికుల విడిది కోసం కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ఎఫ్‌బీఐ గుర్తించింది. ముఖ్యంగా మోటల్‌లోని మూడో అంతస్తును డ్రగ్స్ విక్రయాలు, వ్యభిచారం కోసం వీరు ప్రత్యేకంగా కేటాయించినట్లు విచారణలో తేలింది. ఈ అక్రమ దందాల ద్వారా వచ్చే లాభాల్లో ఈ దంపతులు భారీగా వాటాలు తీసుకున్నట్లు అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. గత రెండేళ్లుగా ఈ మోటల్‌పై నిఘా పెట్టిన అధికారులు నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు ఒక పక్కా ప్లాన్ వేశారు. 2023 మే నుంచి 2025 డిసెంబర్ మధ్య కాలంలో పోలీసులు పలుమార్లు కస్టమర్ల వేషంలో వెళ్లి సోదాలు జరిపారు. ఈ కాలంలో తొమ్మిదిసార్లు వ్యభిచార ఒప్పందాలు, 15సార్లు ప్రమాదకరమైన డ్రగ్స్ కొనుగోళ్లు జరిగినట్లు కోర్టు పత్రాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో 11 సార్లు అత్యంత ప్రాణాంతకమైన 'ఫెంటానిల్' డ్రగ్, 4 సార్లు కొకైన్ విక్రయాలు జరిగాయి. ఈక్రమంలోనే ఈ దంపతులపై డ్రగ్స్ పంపిణీకి కుట్ర పన్నడం, వ్యభిచారాన్ని ప్రోత్సహించడం వంటి తీవ్రమైన క్రిమినల్ అభియోగాలు మోపారు. ఈ కేసులు నిరూపితమైతే.. అమెరికా చట్టాల ప్రకారం వీరికి కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. శర్మ దంపతులతో పాటు మార్గో వాల్డన్ పియర్స్, జాషువా రోడెరిక్, రషార్డ్ పెర్రిష్ స్మిత్ అనే మరో ముగ్గురు వ్యక్తులను కూడా అధికారులు ఈ ఆపరేషన్‌లో భాగంగా అదుపులోకి తీసుకున్నారు.

Post a Comment

0 Comments

Close Menu