కేరళలోని తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను, త్రిసూర్-గురువాయూర్ ప్యాసింజర్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఇవి కేరళతో పాటు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య రైలు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి. అలాగే 'పీఎం స్వనిధి క్రెడిట్ కార్డ్'ను ఆవిష్కరించారు. ఈ క్రెడిట్ కార్డ్ ప్రత్యేకత ఏమిటంటే దీనిని యూపీఐతో లింక్ చేయవచ్చు. ఇది వడ్డీ లేని, 'రివాల్వింగ్ క్రెడిట్' సౌకర్యాన్ని అందిస్తుంది. దేశవ్యాప్తంగా వీధి వ్యాపారులు, తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసేవారు, ఫుట్‌పాత్ వ్యాపారులకు ఆర్థికంగా అండగా నిలవడానికి దీనిని రూపొందించారు. మొదటి రెండు పీఎం స్వనిధి రుణాలను సకాలంలో చెల్లించిన వీధి వ్యాపారులు ఈ క్రెడిట్ కార్డుకు అర్హులు. ప్రారంభంలో ₹10,000 వరకు క్రెడిట్ లిమిట్ ఉంటుంది, ఇది తర్వాత ₹30,000 వరకు పెరుగుతుంది. ఈ కార్డు ఐదేళ్లపాటు చెల్లుబాటులో ఉంటుంది. రోజువారీ వ్యాపార ఖర్చుల కోసం బ్యాంకుల ద్వారా ఈ కార్డు జారీ చేయబడుతుంది. పీఎం స్వనిధి పథకాన్ని కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జూన్ 1, 2020న ప్రారంభించింది. దీని ద్వారా మొదట ₹10,000 పూచీకత్తు లేని రుణం ఇస్తారు. ఆ తర్వాత ₹20,000, ₹50,000 వరకు రుణాలు లభిస్తాయి. సకాలంలో చెల్లింపులు చేస్తే 7% వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు నెలకు ₹100 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తారు.
0 Comments