రాజస్థాన్ లోని జైపూర్‌కు చెందిన శివ్ జ్యువెలర్ యజమాని శివ్ జోహ్రీ కూతురు శ్రుతి వివాహానికి దాదాపు రూ. 25 లక్షల విలువైన 3 కిలోల స్వచ్ఛమైన వెండిని ఉపయోగించి అద్భుతమైన ‘వివాహ ఆహ్వానం’ను రూపొందించాడు. ఈ కార్డు అత్యంత అద్భుతమైన లక్షణం దాని డిజైన్. 128 వేర్వేరు ముక్కలతో తయారు చేసిన ఈ కార్డులో ఒక్క మేకు, స్క్రూ కూడా ఉపయోగించలేదు. ఇది స్వచ్ఛమైన వెండితో పురాతన చేతిపనుల పరిపూర్ణ సమ్మేళనంతో చెక్కడం జరిగింది. శివ్ జ్యువెలర్ తన కుమార్తె వివాహానికి బంధువులే కాకుండా విశ్వంలోని అన్ని దేవుళ్లు, దేవతలు కూడా సాక్ష్యమివ్వాలని కోరుకున్నాడు. అందువల్ల, ఈ 8 x 6.5-అంగుళాల కార్డులో 65 మంది దేవుళ్లు, దేవతల క్లిష్టమైన చిత్రాలతో చెక్కారు. పైభాగంలో: గణేశుడు, కుడి-ఎడమల శివుడు, పార్వతీ దేవి, విష్ణువు, లక్ష్మీ దేవి విగ్రహాలు ఉన్నాయి. ఈ కార్డులు శ్రీకృష్ణుని జీవిత సంఘటనలు, విష్ణువు దశావతారాలు, దక్షిణ భారత శైలి తిరుపతి శ్రీవెంకటేశ్వరుడి దర్శనాన్ని వర్ణించారు. లక్ష్మీదేవి, సూర్యభగవానుడి ఎనిమిది రూపాలతో చెక్కడంతో మరింత గొప్పగా తీర్చిదిద్దారు. ఈ ప్రత్యేకమైన బహుమతిని సృష్టించడానికి శివ్ జోహ్రీకి ఒక సంవత్సరం పట్టింది. “సుమారు ఆరు నెలల పాటు చర్చించిన తర్వాత, కూతురికి తరతరాలుగా గుర్తుండిపోయేలా ఏదైనా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. కూతురి వివాహానికి అందరు దేవుళ్లు, దేవతల ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాను” అని ఆయన వివరించారు. కార్డు చుట్టూ ఏనుగులు పూల వర్షం కురిపించాయి, వాటి పేర్లు కూడా వెండిపై చెక్కారు. ఆ సొగసైన కార్డు మధ్యలో వధూవరులు శృతి – హర్ష్ పేర్లు ఉన్నాయి. లోపల, కుటుంబ సభ్యులందరి పేర్లు కూడా సాంప్రదాయకంగా వెండిపై చెక్కబడి ఉన్నాయి.
0 Comments