Ad Code

టీ20 వరల్డ్ కప్ కోసం భారత్‌కు రావడానికి నిరాకరించిన బీసీబీ


టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడటానికి భారత్ వెళ్లకూడదని నిర్ణయించినట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తెలిపింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ నుండి ముస్తాఫిజుర్‌ రెహ్మాన్ విడుదల చేయడం దీనికి ప్రధాన కారణం. భద్రతా కారణాలను చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తాము ఆడబోయే మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని అధికారికంగా అభ్యర్థించింది. ఈ మేరకు ఐసీసీకి ఈ మెయిల్ పంపించింది. భద్రతపరమైన ఆందోళనల కారణంగా టీ20 వరల్డ్ కప్ కోసం తమ జట్టును భారత్ కు పంపడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. భారత గడ్డపై తమ మ్యాచ్‌లను ఆడకూడదని 17 మంది బీసీబీ డైరెక్టర్లు తీర్మానించారని, దీనికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. మొన్నటి ఐపీఎల్ ఆక్షన్ లో ముస్తాఫిజుర్‌ను ఏకంగా 9.20 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది కోల్ కత నైట్ రైడర్స్. అదే సమయంలో బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక సంఘటనలు, అక్కడి హిందువుల భద్రతపై భారత్ లో ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ముస్తాఫిజుర్‌ బంగ్లాదేశ్ కు చెందిన క్రికెటర్ కావడం వల్ల అతన్ని ఐపీఎల్ లో ఆడించకూడదని సూచనలు బీసీసీఐకి అందాయి. దీంతో కేకేఆర్ యాజమాన్యం అతన్ని తొలగించాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు దీనికి ప్రతిస్పందిస్తూ భారత్ లో ఆడబోయే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లను బాయ్ కాట్ చేసింది. బంగ్లాదేశ్ తన ప్రపంచ కప్ ప్రస్థానాన్ని ఫిబ్రవరి 7న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరగాల్సిన మ్యాచ్ తో ప్రారంభం కావాల్సి ఉంది. ఇటలీ, నేపాల్, ఇంగ్లాండ్, వెస్టిండీస్‌తో పాటు గ్రూప్ సీలో ఉందీ జట్టు. ఆయా దేశాలతో భారత్ లో ఒక్కో మ్యాచ్ ను ఆడాల్సి ఉంది. ఇప్పుడు వాటన్నింటినీ కూడా శ్రీలంకకు తరలించాలని కోరుతోంది. ఓ ఐపీఎల్ ఫ్రాంఛైజీతో ఒప్పందం ఉన్నప్పటికీ తమ దేశ క్రికెటర్ భారత్‌లో ఆడలేకపోతే దానికి అర్థం లేదని బంగ్లాదేశ్ క్రీడా శాఖ సలహాదారు నజ్రూల్ వ్యాఖ్యానించారు. ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నమెంట్‌లో తమ దేశ జట్టుకు భద్రత ఉంటుందనుకోవట్లేదని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రపంచ కప్ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించాలని కోరుతూ బీసీబీకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. బంగ్లాదేశ్‌కు సంబంధించిన ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారంపై నిషేధం విధించాలని సమాచార, ప్రసారాల శాఖను కోరారు.

Post a Comment

0 Comments

Close Menu