ఒడిశాకు చెందిన 18 మంది అథ్లెట్లు టికెట్లు ధృవీకరణ కాకపోవడంతో రైలులోని టాయిలెట్ల సమీపంలో కూర్చుని ప్రయాణించిన ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే ఉత్తర ప్రదేశ్‌లో నిర్వహించిన 69వ జాతీయ స్కూల్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనేందుకు ఒడిశా నుంచి 10 మంది బాలురు, 8 మంది బాలికలు కలిపి మొత్తం 18 మంది అథ్లెట్లు బయలుదేరారు. అయితే తిరుగు ప్రయాణానికి అవసరమైన ధృవీకరించబడిన రైలు టికెట్లు అందుబాటులో లేకపోవడంతో, వారు జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించాల్సి వచ్చింది. దీంతో అథ్లెట్లు తమ లగేజీతో కలిసి రైలు టాయిలెట్ల వెలుపల ఇరుక్కుని, స్టీల్ ఫ్లోర్‌పై చలిలో కూర్చుని ప్రయాణించాల్సిన దయనీయ పరిస్థితి ఎదురైంది. ఈ విషయంపై ఒడిశా స్కూల్ మరియు సామూహిక విద్యా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జ్యోతి ప్రసాద్ పరిదా స్పందిస్తూ, తిరుగు ప్రయాణానికి కేవలం నలుగురు అథ్లెట్లకే టికెట్లు ధృవీకరించబడ్డాయని తెలిపారు. అయితే.. మిగిలిన అథ్లెట్లు ఈ పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, టాయిలెట్ సమీపంలో కూర్చుని ప్రయాణించడం తమకు మానసిక, శారీరక ఇబ్బందులకు గురి చేసిందని పేర్కొన్నారు. ఒడిశా స్పోర్ట్స్ అథారిటీకి చెందిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఈ ఘటనను "నిర్వహణ లోపం"గా అభివర్ణించారు. తిరుగు ప్రయాణానికి సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే అథ్లెట్లు అదే దయనీయ స్థితిలో తిరిగి రావాల్సి వచ్చిందని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటన క్రీడాకారుల భద్రత, గౌరవంపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.
0 Comments