Ad Code

భారత్-న్యూజిలాండ్ మధ్య పలు రంగాల్లో వ్యూహాత్మక సహకారం


భారత్‌-న్యూజిలాండ్ సంబంధాల్లో కీలక మైలురాయిగా నిలిచే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విజయవంతంగా పూర్తైనట్లు ప్రధాని నరేంద్ర మోడీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్ సంయుక్తంగా ప్రకటించారు. సోమవారం ఇద్దరు నేతల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణలో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఇరు దేశాలకు పరస్పర ప్రయోజనాలు చేకూర్చే ఈ చారిత్రక ఒప్పందం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడనున్నాయని పేర్కొన్నారు. ఈ ఎఫ్టీఏను అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, ఆశావహమైన ఒప్పందంగా అభివర్ణించారు. మార్చి 2025లో ప్రధాని లక్సన్ భారత పర్యటన సమయంలో ప్రారంభమైన చర్చలు కేవలం తొమ్మిది నెలల్లోనే ముగియడం గమనార్హం. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న రాజకీయ సంకల్పం, పరస్పర విశ్వాసాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోందని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ ఒప్పందంతో భారత్‌-న్యూజిలాండ్ మధ్య ఆర్థిక సహకారం గణనీయంగా పెరుగుతుందని, మార్కెట్ యాక్సెస్ విస్తరిస్తుందని, పెట్టుబడులు ప్రోత్సాహం పొందుతాయని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా వ్యాపారులు, పెట్టుబడిదారులు, రైతులు, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు, విద్యార్థులు, యువతకు కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. పలు రంగాల్లో వ్యూహాత్మక సహకారం మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. ఈ ఒప్పందం అమలులోకి వస్తే వచ్చే ఐదేళ్లలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, వచ్చే 15 ఏళ్లలో న్యూజిలాండ్ నుంచి భారత్‌కు సుమారు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశముందని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. వాణిజ్యంతో పాటు రక్షణ, క్రీడలు, విద్య, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో కూడా పురోగతిని ఇద్దరు ప్రధాని స్వాగతించారు. ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని, ఒప్పందం సజావుగా అమలయ్యేలా నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని నిర్ణయించారు. తరువాత ఎక్స్ వేదికగా స్పందించిన ప్రధాని లక్సన్, భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు పూర్తయ్యాయని వెల్లడించారు. ఈ ఒప్పందం ద్వారా భారత్‌కు న్యూజిలాండ్ ఎగుమతులపై 95 శాతం వరకు టారిఫ్‌లు తగ్గించబడతాయని లేదా తొలగించబడతాయని తెలిపారు. దీని ఫలితంగా వచ్చే రెండు దశాబ్దాల్లో భారత్‌కు న్యూజిలాండ్ ఎగుమతులు వార్షికంగా 1.1 బిలియన్ డాలర్ల నుంచి 1.3 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటని, ఈ ఒప్పందం ద్వారా న్యూజిలాండ్ వ్యాపారాలకు 140 కోట్ల మంది భారత వినియోగదారుల మార్కెట్ అందుబాటులోకి వస్తుందని లక్సన్ తెలిపారు. రైతులు, సాగుదారులు, వ్యాపారులకు ఇది కొత్త ద్వారాలు తెరుస్తుందని, ఎగుమతులు పెరిగి ఉద్యోగాలు, ఆదాయాలు పెరుగుతాయని మరో వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఒమన్, యూకే, ఈఎఫ్‌టీఏ దేశాలు, యూఏఈ, ఆస్ట్రేలియా, మారిషస్ తర్వాత భారత్ కుదుర్చుకున్న ఏడవ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇదే కావడం విశేషం.

Post a Comment

0 Comments

Close Menu