Ad Code

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై పలు బస్సులు, కార్లకు మంటలు : సజీవంగా అగ్నికి ఆహుతైన ప్రయాణికులు ?


ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డుపై పలు బస్సులు, కార్లకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో బస్సుల్లో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు సజీవంగా అగ్నికి ఆహుతయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. అందిన సమాచారం మేరకు మొత్తం 4 బస్సులకు మంటలు అంటుకున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదం చాలా తీవ్రంగా ఉండటం వల్ల బస్సులు మంటల్లో కాలిపోవడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. స్థానికులు, వాహనదారులు మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. సమీపంలోని ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో బస్సుల మంటలకు సంబంధించి దృశ్యాలను చిత్రీకరించాడు. ఈ ఘటనలో నాలుగు బస్సులు మంటల్లో పూర్తిగా కాలిపోయినట్లు ఆ వ్యక్తి వీడియోలో తెలిపాడు. భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఓ వైపు దట్టమైన పొగలు, మరోవైపు బస్సుల్లో ప్రమాదానికి గురైన ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రదేశం భీతావాహకంగా మారింది. దట్టమైన మంచుకారణంగా 7 బస్సులు, 3 కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. దాదాపు 20 అంబులెన్స్‌ల ద్వారా గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. బల్దేవ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని మైల్‌స్టోన్ 127 సమీపంలో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సంఘటన జరిగిన వెంటనే డిఎం, ఎస్పీతో సహా సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు, అగ్నిమాపక శాఖ, ఎన్‌హెచ్‌ఏఐ, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాయి. 

Post a Comment

0 Comments

Close Menu