సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా తన జీవితంలో ఎదురైన ఒక భయంకరమైన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. దొంగతనాలు, దాడులు ఎక్కువగా జరిగే రోజుల్లో న్యూయార్క్ నగరంలో తాను ఎదుర్కొన్న ఆ ఘటన తనను తీవ్ర భయానికి గురి చేసిందని చెప్పారు. ఆ రోజు తన జీవితంలో చివరి రోజేనని కూడా అనిపించిందని, అయితే అనుకోని విధంగా ధర్మేంద్రతో కలిసి నటించిన ఒక సినిమా తన ప్రాణాలను కాపాడిందని ఎమోషనల్ అయ్యారు. న్యూయార్క్‌కు వెళ్లినప్పుడు తాను రాడిసన్ హోటల్‌లో బస చేశానని, అదే ప్రాంతంలో నివసిస్తున్న తన స్నేహితురాలు ఒక రోజు డిన్నర్‌కు ఆహ్వానించడంతో ఆమె ఇంటికి వెళ్లానని డిన్నర్ అనంతరం షాపింగ్ చేసి తిరిగి హోటల్‌కు బయల్దేరినట్లు వివరించారు. అప్పటికే అర్ధరాత్రి ఒంటి గంట దాటడంతో ఆమె తనను కారులో తీసుకొచ్చి ఒక చోట దింపి, అక్కడి నుంచి కొద్దిదూరం నడిస్తే హోటల్ వస్తుందని చెప్పి వెళ్లిపోయిందన్నారు. అయితే బ్యాగ్ నిండా ఖరీదైన వస్తువులతో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న తనకు గంటసేపు నడిచినా హోటల్ కనిపించలేదని చెప్పారు. చుట్టూ చూస్తే అన్ని దారులూ ఒకేలా కనిపించడంతో పాటు, ఆ ప్రాంతం దొంగలకు ప్రసిద్ధి చెందినదని అప్పట్లో పేరు ఉండటంతో భయం మరింత పెరిగిందన్నారు. ఒక వ్యక్తిని హోటల్‌కు దారి అడిగితే అతడు విసుగ్గా వెళ్లిపోయాడని, చీకటి, నిర్మానుష్య వాతావరణంలో తనకు అదే చివరి రోజు అనిపించిందని శత్రుఘ్న సిన్హా గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఒక కారు తన ముందుగా వెళ్లిందని, అందులో దోపిడీ దొంగలు ఉన్నారేమోనని అనుమానం వచ్చిందన్నారు. తనను చంపి, బ్యాగ్‌లో ఉన్న విలువైన వస్తువులు తీసుకెళ్తారని భావించి భయం రెట్టింపు అయిందని తెలిపారు. కానీ అనుకోని విధంగా ఆ కారులోని డ్రైవర్ బయటకు వచ్చి తనను గుర్తుపట్టడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. ఆ డ్రైవర్ తాను ధర్మేంద్రతో కలిసి నటించిన పంజాబీ చిత్రం 'పుట్ జట్టన్ దే'లో నటించానని గుర్తించి మాట్లాడాడని శత్రుఘ్న సిన్హా చెప్పారు. ఆ ప్రాంతం చాలా ప్రమాదకరమని హెచ్చరించిన అతడు, వెంటనే తన స్నేహితులను పిలిపించి నన్ను కారులో ఎక్కించుకొని సురక్షితంగా హోటల్ వద్ద దింపేశాడని వివరించారు. కృతజ్ఞతగా వారికి డబ్బులు ఇవ్వాలని ప్రయత్నించినా వారు నిరాకరించారని, ఆ మానవత్వాన్ని తాను జీవితాంతం మర్చిపోలేనని అన్నారు.
0 Comments