ఆపిల్ సంస్థ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా అమర్ సుబ్రమణ్యను నియమించింది. సుదీర్ఘకాలం పనిచేసిన జాన్ గియాన్నండ్రియా స్థానంలో ఆయన నియమితులయ్యారు. గియాన్నండ్రియా వచ్చే వసంతకాలంలో పదవీ విరమణ చేసే వరకు సలహాదారుగా కొనసాగుతారు. ఈ సందర్భంగా ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ మాట్లాడుతూ ఏఐ ఆపిల్ వ్యూహంలో కీలకమని తెలిపారు. అమర్ అసాధారణ ఏఐ నైపుణ్యాన్ని ఆపిల్‌కు అందించడం మాకు ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. కంపెనీ బ్లాగులో "ఏఐ, మెషీన్ లెర్నింగ్ పరిశోధనతో పాటు, వాటిని ఉత్పత్తులలో సమర్థవంతంగా ఏకీకృతం చేయడంలో ఆయనకున్న లోతైన అనుభవం ఆపిల్ ఆవిష్కరణలు, భవిష్యత్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు ముఖ్యమని పేర్కొంది. సుబ్రమణ్య 2001లో బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రులయ్యారు. ఆయన ఐబీఎంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కెరీర్ మొదలుపెట్టి.. 2005లో వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుండి పీహెచ్‌డీ చేశారు. అనంతరం మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌షిప్, విజిటింగ్ రీసెర్చర్‌గా పనిచేశారు. డాక్టరల్ అధ్యయనాల తర్వాత, కాలిఫోర్నియాలోని మౌంటైన్ వ్యూలో ఉన్న గూగుల్‌లో స్టాఫ్ రీసెర్చ్ సైంటిస్ట్‌గా చేరారు. అక్కడ ఎనిమిదేళ్లలో ప్రిన్సిపల్ ఇంజనీర్‌గా, ఆపై 2019లో ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందారు. గూగుల్ జెమిని అసిస్టెంట్ ఇంజనీరింగ్‌కు ఆయన నాయకత్వం వహించారు.
0 Comments