శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తుతున్నారు. గత ఏడాది కంటే పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలి వచ్చారు. నవంబరు 16న ప్రారంభమైన మండల పూజా మహోత్సవాలు, డిసెంబర్ 27న ముగియనున్నాయి. గత ఏడాది ఈ సమయానికి సుమారు 21 లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించారు. ప్రస్తుత సీజన్‌లో ఆ సంఖ్య 25 లక్షలు దాటింది. మొదటి రోజుల్లో భారీ రద్దీ ఏర్పడినా సకాలంలో జోక్యం చేసుకోవడం ద్వారా పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు ఆలయ పాలకవర్గం వెల్లడించింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నా సమర్ధమవంతమైన ప్రణాళిక, ఏర్పాట్లు కారణంగా ఆలయంలో దర్శనం సజావుగా కొనసాగుతోంద ని వివరించారు. అయితే వర్చువల్ క్యూ పాస్‌ల్లో పేర్కొన్న తేదీన భక్తులు రాకపోవడం వల్లే తాత్కాలిక రద్దీ ఏర్పడింది. భక్తులకు కేటాయించిన తేదీలకు కట్టుబడి ఉంటే ప్రతి ఒక్కరికీ దర్శనం కోసం తగినంత సమయం కేటాయించవచ్చని చెబుతున్నారు. డిసెంబర్ నెలాఖరకు రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని రానున్న కాలంలో భక్తులందరికీ సజావుగా దర్శనం అయ్యేలా సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నారు. శబరిమల అయ్యప్ప దర్శనం కోసం క్యూలో వేచి ఉండే భక్తులకు బిస్కెట్లు, తాగునీరు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. చిన్నారులు, మహిళల కోసం ప్రత్యేక క్యూ వ్యవస్థను తీసుకొచ్చారు. దొంగల నుంచి భక్తుల రక్షణ కోసం ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను, మాలికప్పురంలోని అన్నదాన మండపంలో భక్తులకు తగినంత ఆహారం లభించేలా ఏర్పాట్లు చేశారు. శబరిమల కొండ ఎక్కేటప్పుడు కండరాల నొప్పితో బాధపడే యాత్రికులకు సహాయం చేయడానికి సన్నిధానంలో 24 గంటల ఉచిత ఫిజియోథెరపీ కేంద్రం పనిచేస్తుంది. పంబా, సన్నిధానంలో ఆఫ్ రోడ్ అంబులెన్స్‌లు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. 41రోజుల పాటు జరిగే మండల పూజ డిసెంబర్ 27న ముగుస్తుంది. అదే రోజు రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసేస్తారు. మళ్లీ డిసెంబర్ 30న మకరవిలక్కు కోసం ఆలయాన్ని తెరుస్తారు. 2026 జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. అదే నెల 20న ఆలయాన్ని మూసివేస్తారు.
0 Comments