Ad Code

డిజిటల్ అరెస్టు మోసాలపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ !


డిజిటల్ అరెస్టు మోసాలపై దేశవ్యాప్తంగా సీబీఐ విచారణకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మోసాల వల్ల ఇప్పటివరకు భారీ నష్టం జరిగినట్లు గుర్తించిన సుప్రీంకోర్టు, సీబీఐ విచారణకు రాష్ట్రాలు అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. డిజిటల్‌ అరెస్టులపై సుప్రీంకోర్టులో విచారణ భాగంగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బగ్చి నేతృత్వంలోని బెంచ్ ఈ కేసును స్వయంగా పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్‌గా(సుమోటో పీల్‌) తీసుకుని విచారించింది. డిజిటల్‌ అరెస్టులో భాగంగా కొంతమంది పోలీసు, కోర్టు అధికారులుగా నటిస్తూ, నకిలీ సుప్రీం కోర్టు ఆదేశాలు చూపించి, ప్రజలను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నారు. దాంతో పలువురు డిజిటల్‌ అరెస్టు బారిన పడి కోట్ల రూపాయలు నష్టాన్ని చవిచూస్తున్నారు. 2025 చివరి త్రైమాసికంలో డిజిటల్ అరెస్టు మోసాలు విపరీతంగా పెరగడంతో, కోర్టు జోక్యం చేసుకుంది. ఈ మోసాలు రాష్ట్రాలవారీగా కాకుండా దేశవ్యాప్తంగా జరుగుతున్నందున, సీబీఐకి కేంద్రీకృత విచారణ బాధ్యత అప్పగించాలని సుప్రీం నిర్ణయించింది. దీనిలో భాగంగా డిజిటల్‌ అరెస్టు మోసాలపై రాష్ట్రాలు సీబీఐ విచారణకు సహకరించాలని పేర్కొంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ వద్ద నమోదైన ఎఫ్‌ఐఆర్‌ వివరాలను సీబీఐకి అందించాలని, ఫలితంగా సదర సంస్థ పూర్తి స్వేచ్ఛతో విచారణ చేయడానికి ఆస్కారం దొరుకుతుందని తెలిపింది. -ఇతర సైబర్ మోసాలు (ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌లు తరహా లాంటి కేసులు ఉన్నా మొదట ప్రాధాన్యం డిజిటల్ అరెస్టు కేసులకు ఇవ్వాలని ఆదేశించింది. ఇంటర్‌పోల్, సోషల్ మీడియా కంపెనీలు, ఆర్బీఐ వంటి సంస్థల సహకారంతో విచారణ జరగాలని కోర్టు సూచించింది. ప్రజల నమ్మకాన్ని కాపాడటానికి, డిజిటల్‌ అరెస్టుల ద్వారా డబ్బు వసూలు చేసే మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

Post a Comment

0 Comments

Close Menu