దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు విదేశీ విద్యపై అత్యధిక ఆసక్తి చూపుతున్నారని తాజా నివేదిక వెల్లడించింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన 'ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా' నివేదిక ప్రకారం, విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో ఏపీ విద్యార్థులే అగ్రస్థానంలో నిలిచారు. నివేదిక గణాంకాల ప్రకారం, 2016లో విదేశాల్లో చదువుతున్న ఏపీ విద్యార్థుల సంఖ్య 46,818గా ఉండగా, 2018 నాటికి అది 62,771కి పెరిగింది. కొవిడ్ మహమ్మారి ప్రభావంతో 2020లో ఈ సంఖ్య 35,614కి తగ్గినప్పటికీ, దేశవ్యాప్తంగా ఇప్పటికీ ఏపీ విద్యార్థులే మొదటి స్థానంలో ఉన్నారని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ఏపీ తర్వాత పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు వరుసగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. 2024 నాటికి మొత్తం 13.35 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నారని వెల్లడించింది. వీరిలో సుమారు 8.5 లక్షల మంది యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొంది. 2016 నుంచి 2024 మధ్యకాలంలో విదేశీ విద్యకు వెళ్లే విద్యార్థుల సంఖ్యలో 8.84 శాతం వృద్ధి రేటు నమోదైందని వెల్లడించింది. విదేశీ విద్య కోసం భారతీయ విద్యార్థులు ఏటా సుమారు రూ.6.2 లక్షల కోట్లను ఖర్చు చేస్తున్నారని, ఇది దేశ జీడీపీలో దాదాపు 2 శాతానికి సమానమని నివేదిక స్పష్టం చేసింది. ఈ ఖర్చులే భారత్ ట్రేడ్ డెఫిసిట్‌లో సుమారు 75 శాతం వరకు కారణమవుతున్నాయని నీతి ఆయోగ్ పేర్కొంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, విదేశాల నుంచి ఒక విద్యార్థి భారత్‌కు చదువుకోడానికి వస్తే, 28 మంది భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారని నివేదిక స్పష్టం చేసింది.
0 Comments