హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వైపు నగరంలోని ఐటీ ఉద్యోగులు నివసించే ప్రాంతాల నుంచి ఈ బస్సులు తిప్పనుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచేలా ఆర్టీసీ నిర్ణయించింది. ఎల్‌బీనగర్, హయత్ నగర్, దిల్‌సుఖ్ నగర్ వైపు నుంచి ఐటీ కారిడార్‌కు ఈ బస్సులు సేవలు అందించనున్నాయి. అందులో భాగంగా 156/316, 300/316 రూట్ బస్సులను కొత్తగా అందుబాటులోకి తెచ్చారు. వీటిల్లో 156/316 రూట్ బస్సులు ఎల్బీనగర్ నుంచి స్టార్ట్ అవుతాయి. అక్కడ నుంచి కోఠి, మెహిదీపట్నం, లంగర్‌హౌస్, నార్సింగ్, కోకాపేట, గర్, కాంటినెంటల్ సర్కిల్, ఐసీఐసీఐ, ఐఐఐటీ ఏరియాలను కవర్ చేస్తూ గచ్చిబౌలి వరకు నడవనున్నాయి. ఇక 300/316 రూట్ బస్సులు హయత్ నగర్ నుంచి ప్రారంభం అవుతాయని అధికారులు వెల్లడించారు. అదే విధంగా ఎల్బీనగర్, సాగర్ క్రాస్ రోడ్, ఆరాంఘర్, హైదర్ గూడ, నార్సింగ్, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, వేక్ రాక్, విప్రో సర్కిల్, ఇన్ఫోసిస్ మీదుగా గచ్చిబౌలికి చేరుకుంటాయి. కాగా.. ఇప్పటికే ఐటీ ఉద్యోగుల కోసం ఆర్టీసీ అనేక ప్రత్యేక బస్సులను నడుపుతోంది. నగరంలోని నలుమూలల నుంచి ఐటీ ఉద్యోగులు సులువుగా ఆఫీసులకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. రెండు, మూడు బస్సులు మారాల్సిన అవసరం లేకుండా బస్సులను ప్రవేశపెడుతోంది. దీని వల్ల ఐటీ ఉద్యోగులకు సమయం ఆదా అవుతుందని అధికారులు వెల్లడించారు. ఈ తాజా నిర్ణయం తో ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తీరుతాయని వివరించారు. త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ సిద్దమవుతోంది. వీటిల్లో కొన్ని బస్సులను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వైపు నడపనున్నారు. దీని వల్ల ఐటీ ఉద్యోగులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.
0 Comments