రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కీలక మలుపు తిరుగుతోంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ముగింపు లేకుండా మరింత భీకరంగా కొనసాగుతోంది. తాజాగా రష్యా సైన్యం యుద్ధరంగంలోని అన్ని వైపులా వేగంగా ముందుకు దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. యుద్ధరంగంలో తమ సైన్యం అన్ని వైపులా పురోగతి సాధిస్తోందని, వ్యూహాత్మక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. మరోవైపు ఉక్రెయిన్ సైన్యం కూడా కొన్ని కీలక ప్రాంతాల నుంచి వెనక్కి తగ్గుతున్నట్లు ధ్రువీకరించింది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం గత 24 గంటల్లో రష్యా దళాలు ఉక్రెయిన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డాయి. పలు కీలకమైన, ప్రయోజనకరమైన ప్రాంతాలను రష్యా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఉక్రెయిన్ సైన్యానికి మద్దతుగా నిలుస్తున్న మిలిటరీ-ఇండస్ట్రియల్ ప్లాంట్లు, ఇంధన కేంద్రాలు, రవాణా వ్యవస్థలు, నిల్వ కేంద్రాలపై రష్యా బాంబుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్ ఉపయోగిస్తున్న లాంగ్ రేంజ్ డ్రోన్ల తయారీ కేంద్రాలను, విదేశీ కిరాయి సైనికులు ఉంటున్న తాత్కాలిక స్థావరాలను రష్యా క్షిపణులు ధ్వంసం చేశాయి. రష్యా దాడుల తీవ్రత పెరగడంతో ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ కీలక ప్రకటన చేశారు. సూమీ రీజియన్‌లోని క్రాస్నోపిలియా కమ్యూనిటీ సరిహద్దు గ్రామాల్లో రష్యా సైన్యం వేగంగా ముందుకు రావడంతో ఉక్రెయిన్ దళాలు అక్కడ కొన్ని చోట్ల వెనక్కి తగ్గాయి. తమ సైన్యం వెనక్కి తగ్గినప్పటికీ రష్యా దళాలకు భారీ నష్టం చేకూర్చేలా దాడులు కొనసాగిస్తున్నామని ఉక్రెయిన్ వెల్లడించింది. రష్యా తన దాడుల్లో డ్రోన్లు, భారీ బాంబులను పెద్ద ఎత్తున ఉపయోగిస్తోంది. చలికాలం తీవ్రం కావడానికి ముందే ఉక్రెయిన్‌లోని కీలక ఇంధన వనరులను దెబ్బతీసి, ఆ దేశాన్ని మోకాళ్లపైకి తేవాలని పుతిన్ భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. రష్యా దూకుడు చూస్తుంటే మరింత భూభాగాన్ని స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
0 Comments