Ad Code

తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ !


కేరళలోని తిరువనంతపురంలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ విజయం సాధించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అక్కడి ప్రజలకు ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం కేరళ రాజకీయాల్లో ఓ కీలక మలుపు అని ఆయన అభిప్రాయపడ్డారు. 'తిరువనంతపురం ప్రజలకు ధన్యవాదాలు! నగర కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ-ఎన్డీఏకు ఆధిక్యం లభించడం కేరళ రాజకీయాల్లో ఓ కీలక మలుపు. రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షలను మా పార్టీ మాత్రమే తీర్చగలదని ప్రజలు భావిస్తున్నారు. ఈ శక్తిమంతమైన నగరాభివృద్ధికి, ప్రజలకు జీవన సౌలభ్యాన్ని పెంపొందించేందుకు మా పార్టీ కృషి చేస్తుంది. ఈ ఎన్నికల్లో అద్భుత ఫలితాలను సాధించడంలో శ్రమించిన బీజేపీ కార్యకర్తలందరికీ నా కృతజ్ఞతలు. అట్టడుగు స్థాయి నుంచి పనిచేయడంలో కార్యకర్తల దీర్ఘకాల కృషి, పోరాటాలను నేడు మనం గుర్తుచేసుకోవాలి. మన కార్యకర్తలే మనకు బలం' అని మోడీ పేర్కొన్నారు. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 101 వార్డుల్లో ఎన్డీఏ 50 స్థానాలను గెలుచుకుని చారిత్రక విజయం సాధించింది. అక్కడ అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ 29 వార్డులకు పరిమితమైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 19 స్థానాలను గెల్చుకోగా, స్వతంత్ర అభ్యర్థులు రెండు వార్డులలో గెలుపొందారు.

Post a Comment

0 Comments

Close Menu