Ad Code

మరోసారి భారీ నష్టాల్లోకి జారిన దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు !


దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు మరోసారి భారీ నష్టాల్లోకి జారాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కీలక స్థాయిలను కోల్పోయాయి. సెన్సెక్స్ 534 పాయింట్లు తగ్గి 84,680 వద్ద ముగియగా, నిఫ్టీ 167 పాయింట్లు పడిపోయి 25,860 వద్ద క్లోజ్ అయింది. రెండు వారాలుగా విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు కొనసాగుతుండటం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం మార్కెట్‌పై ఒత్తిడిని పెంచాయి.  స్టాక్ మార్కెట్లపై రూపాయి పతనం ప్రభావంకూడా తీవ్రంగా పడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 91 మార్క్‌ను దాటి కొత్త జీవితకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. గత సెషన్‌లో 90.78 వద్ద ముగిసిన రూపాయి, ఈ రోజు ప్రారంభంలోనే మరింత బలహీనపడి 36 పైసలు తగ్గి 91.14 స్థాయికి చేరింది. రాబోయే రోజుల్లో ఇది 100 స్థాయికి చేరే అవకాశముందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 23 నష్టాలతో ముగిశాయి. యాక్సిస్ బ్యాంక్, జొమాటో షేర్లు దాదాపు 5 శాతం పడిపోగా, టైటాన్, ఎయిర్‌టెల్ సుమారు 2 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ 50లో 39 షేర్లు నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, రియల్టీ, మెటల్, ఆటో, ఫార్మా రంగాల్లో అమ్మకాలు ఎక్కువగా కనిపించాయి. మీడియా, కన్స్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు మాత్రం కొంత లాభంతో నిలిచాయి. ప్రపంచ మార్కెట్లలో కూడా నష్టాలే ఆధిపత్యం చెలాయించాయి. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి సూచీ 2.24 శాతం తగ్గి 3,999 వద్ద, జపాన్ నిక్కీ 1.56 శాతం పడిపోయి 49,383 వద్ద ముగిసింది. హాంకాంగ్ హాంగ్‌సెంగ్ సూచీ 1.54 శాతం తగ్గి 25,235 వద్ద, చైనా షాంఘై కాంపోజిట్ 1.11 శాతం పడిపోయి 3,825 వద్ద ముగిసింది. అమెరికా మార్కెట్లలోనూ నెగెటివ్ ధోరణే కనిపించింది. డిసెంబర్ 15న డౌ జోన్స్ స్వల్పంగా 0.086 శాతం తగ్గి 48,416 వద్ద ముగియగా, నాస్‌డాక్ కాంపోజిట్ 0.59 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.16 శాతం నష్టపోయాయి.

Post a Comment

0 Comments

Close Menu