హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ నన్ను దూషించడం, అవమానించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానంగా పెట్టుకుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామని, ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కన్పించిందని వివరించారు. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలైతే బీఆర్‌ఎస్ సత్తా ఇంకా తెలిసేదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. పార్టీని గెలిపించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిపోయిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఒకప్పుడు యూరియా ఇంటికి, చేను వద్దకు వచ్చేదని ఇప్పుడు కుటుంబమంతా లైన్ లో నిలబడే పరిస్థితి వచ్చిందని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకం ప్రకటించకపోగా ఉన్నవాటిని ఆపేసిదన్నారు. రైతులకు నీటిని అందించేందుకు నిర్మించిన చెక్ డ్యామ్ లను పేల్చివేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా ఒక్క కొత్త పాలసీని కూడా తీసుకురాలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను దూషించడం, నేను చనిపోవాలని శాపాలు పెట్టడమే ఇప్పుడు అనుసరిస్తున్న విధానమని కేసీఆర్ ధ్వజమెత్తారు. తాను సీఎంగా ఉన్న సమయంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రశంసించి, దాని వ్యయ పరిమితిని రూ. 2లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచినట్లు గుర్తు చేశారు. మరి నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.
0 Comments