దిత్వా తుపాను బంగాళాఖాతంలో తమిళనాడు తీరానికి సమాంతరంగా నెమ్మదిగా ఉత్తర దిశగా కదులుతోంది. ఈ వాయుగుండం గంటకు సగటున 5 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. తీరానికి దగ్గరగా ప్రయాణించడం, పొడి గాలులు దీనివైపు వీయడం వల్లే తుఫాను బలహీనపడిందని ఇస్రో నిపుణులు తెలిపారు. ఈ వాయుగుండం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలుచోట్ల, మధ్య, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ సోమవారం వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు దక్షిణ కోస్తాలో అనేకచోట్ల, ఉత్తరకోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు, కోనసీమ, పశ్చిమగోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్రభావిత కలెక్టరేట్‌లలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రానున్న 24 గంటల్లో కోనసీమ, పశ్చిమగోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
0 Comments