ఇండియన్ రైల్వే పెరిగిన నిర్వహణ ఖర్చులు, ఆధునిక సదుపాయాల కల్పన సాకుగా చూపుతూ ప్రయాణ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు ఏసీ క్లాస్ ప్రయాణికులపై ఈ భారం ఎక్కువగా పడనుంది. రైల్వే బోర్డు విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ప్రయాణ దూరానికి అనుగుణంగా ఛార్జీలను సవరించారు. ఏసీ టిక్కెట్లపై ప్రతి 500 కిలోమీటర్ల ప్రయాణానికి అదనంగా రూ.10 భారం పడనుంది. ఉదాహరణకు, మీరు 1,000 కి.మీ ప్రయాణించాల్సి ఉంటే, పాత ధర కంటే రూ.20 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. స్లీపర్, జనరల్ క్లాస్ ల్లో కూడా స్వల్ప మార్పులు చేసినట్లు తెలుస్తోంది. దూరాన్ని బట్టి రూ.5 నుండి రూ.15 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న వారికి పాత ధరలే వర్తిస్తాయి, కానీ కొత్తగా బుక్ చేసుకునే వారికి పెరిగిన ధరలు వర్తిస్తాయి. ఈ ధరల పెంపు వెనుక ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. వందే భారత్, అమృత్ భారత్ వంటి ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టడం, స్టేషన్ల పునరాభివృద్ధి కోసం భారీగా నిధులు అవసరమవుతున్నాయి. విద్యుత్ ఛార్జీలు, విడిభాగాల ధరలు, సిబ్బంది జీతభత్యాల పెంపు వల్ల రైల్వేపై ఆర్థిక భారం పెరిగింది. రైళ్లలో పరిశుభ్రత, బయో-టాయిలెట్లు, ప్రయాణికుల భద్రత కోసం మరిన్ని నిధులను కేటాయించాలని రైల్వే భావిస్తోంది.
0 Comments