హైదరాబాద్ లోని నాంపల్లి సిబిఐ కోర్టుకు గుర్తు తెలియని వ్యక్తి నుండి కోర్టు ప్రాంగణంలో బాంబు ఉందని ఈ మెయిల్ రావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులను బయటకు పంపి కోర్టు పరిసరాలలో తనిఖీలు చేపట్టారు. సమాచారం అందగానే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించి, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు పోలీసులు తరలించారు. కోర్టు భవనం, పార్కింగ్ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాలలో అడుగడుగునా సోదాలు నిర్వహించారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు కోర్టు ప్రాంగణంలో బాంబు పేలుతుంది అని ఆ ఈ మెయిల్ లో పేర్కొన్నారు. అయితే అక్కడ ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో కోర్టు కార్యకలాపాలు కొంతసేపు నిలిచిపోయాయి. నాంపల్లి ప్రాంతంలో భారీ భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు బాంబు బెదిరింపు వెనుక ఎవరున్నారు అన్న దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఎవరైనా ఆకతాయి చేసిన పనా లేక మరి ఏ ఇతర కారణాలతో చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మెయిల్ వచ్చిన సర్వర్ ను ట్రేస్ అవుట్ చేసే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నారు. అయితే ఇటీవల ఢిల్లీలో ఎర్రకోట సమీపంలోనే బాంబు బ్లాస్ట్ జరగడంతో జరిగిన అపార ప్రాణ నష్టం తెలిసిందే. ఆ తర్వాత దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు కుట్ర జరిగిందన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు పలువురు అనుమానితులను కూడా అరెస్ట్ చేశారు. ప్రజా ప్రదేశాలు, న్యాయస్థానాలకు బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
0 Comments